
తెలుగు ప్రేక్షకులకు హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సినిమాలు రుచి చూపిస్తున్న దర్శకుడుగా ప్రవీణ్ సత్తారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి ‘గాండీవధారి అర్జున’ సినిమాతో ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పేరులోనే ఇది కూడా పూర్తి యాక్షన్ సినిమా అని అర్దమవుతూనే ఉంది. తాజాగా విడుదల చేసిన టీజర్ కూడా అదే నిరూపించింది.
వాతావరణ మార్పులపై భారత్ తరపున ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్న నాజర్ని హత్య చేసేందుకు కొన్ని అంతర్జాతీయ ముఠాలు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తుంది. వారి నుంచి నాజర్‌ను కాపాడేందుకు ఏజంట్ అర్జున్ (వరుణ్ తేజ్)కు అప్పగించబడుతుంది. ఈ మిషన్‌లో అతనికి తోడుగా మరో ఏజంట్ సాక్షి వైద్య పాల్గొంటుంది. టీజర్లో వరుణ్ తేజ్ ఎంట్రీని చూపించిన విధానం, ఇంకా యాక్షన్ సన్నివేశాలు చూస్తున్నప్పుడు హాలీవుడ్ సినిమా చూస్తున్నట్లే అనిపిస్తుంది. కనుక ‘గాండీవధారి అర్జున’ సినిమాపై అంచనాలు బారీగా పెరిగేలా చేసింది ఈ చిన్న టీజర్.
ఈ సినిమాలో విమలా రామన్, వినయ్ రాయ్, అరైన్, రోషినీ ప్రకాష్, మనిష్ చౌదరి, అభినవ్ గౌతమ్, రవి వర్మ, కల్పలత, బేబీ వేద ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ప్రవీణ్ సత్తారు వ్రాసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మికీ జె మేయర్ సంగీతం, లిరిక్స్: రెహమాన్, కెమెరా: ముఖేష్ జి (యూకే), యాక్షన్ కొరియోగ్రఫీ:లజ్లో (హంగేరీ), జూజీ (యూకే), విజయ్, వెంకట్ అందిస్తున్నారు.