
మహేష్ బాబు-త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా అంటేనే ఓ క్రేజ్. అది ‘గుంటూరు కారం’ అయితే ఆ ఘాటు చెప్పక్కరలేదు. అయితే వారిద్దరూ కలిసి గుంటూరు కారం దంపడం ప్రారంభించినప్పటి నుంచి ఏవో అవాంతరాలు వచ్చి సినిమా షూటింగ్‌కు ఆటంకాలు ఏర్పాడుతూనే ఉన్నాయి. ఈ సినిమా నుంచి పూజా హెగ్డేని తప్పించేయడం మొదటి షాక్. ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకొంటే, ఇప్పుడు ఆమె స్థానంలో మీనాక్షీ చౌదరి వచ్చింది.
ఈ సినిమాకు సంగీత దర్శకుడు థమన్ అందిస్తున్న మ్యూజిక్ అంత గొప్పగా లేదనే టాక్ వస్తుండటంతో ఆయనను కూడా తప్పించిన్నట్లు ఊహాగానాలు వినిపించాయి కానీ నన్ను ఎవరూ పొమ్మనలేదని ఆయనే స్వయంగా చెప్పుకోవలసి వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా తప్పుకొంటున్నట్లు చెప్పారు. అదే కాస్త పచ్చిగా చెప్పుకొంటే ఆయన పని మహేష్ బాబు, త్రివిక్రం శ్రీనివాస్‌లలో ఎవరికో నచ్చలేదని అర్దం.
సినిమా మద్యలో కెమెరా మ్యాన్ తప్పుకొంటే సినిమా ఆగిపోతుంది. కనుక అత్యవసరంగా వినోద్ స్థానంలో మరొకరిని తీసుకొనేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మహేష్ బాబు ఏటా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళివస్తుంటారు. ఒకవేళ షూటింగ్ ఇంకా ఆలస్యమైతే త్వరలో విదేశాలకు బయలుదేరాలనుకొంటున్నారు.
గుంటూరు కారంలో ఈ మసాలా ఏమిటో గానీ సినిమా షూటింగ్ ఇలాగే ఆలస్యమవుతుంటే జనవరి 13న సినిమా రిలీజ్ చేయగలరో లేదో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు.