నితిన్‌కు ఎవరు హిట్ ఇస్తారో?

సినీ పరిశ్రమలో ఎవరూ వరుసపెట్టి హిట్స్ కొట్టలేరు. చిరంజీవి, ప్రభాస్‌, మహేష్ బాబు వంటి పెద్ద హీరోలు సైతం ఎదురుదెబ్బలు తింటూనే ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో చాలా ఏళ్ళుగా ఉన్న నితిన్‌ కూడా ఇలాగే ఎదురుదెబ్బలు తింటున్నారు. భీష్మతో హిట్ కొట్టిన నితిన్‌ ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గంలో బోర్లా పడ్డాడు. కనుక ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలని ఇద్దరు దర్శకులతో ప్రయత్నిస్తున్నారు. ఒకటి భీష్మతో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో మరొకటి వక్కంతం వంశీతో. 

వెంకీతో మొదలుపెట్టిన సినిమా ఇప్పటికే సెట్స్‌లో ఉంది. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా మళ్ళీ రష్మిక మందనను అనుకొన్నారు. ఆమె ఈ సినిమా పూజా కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. కానీ తర్వాత ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో సినిమా నుంచి తప్పుకొన్నారు. ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకోవాలనుకొంటున్నారు కానీ ఆమె కూడా చాలా బిజీగానే ఉంది. కనుక ఈ సినిమా హీరోయిన్ ఎవరనే విషయం ఇంకా తెలియవలసి ఉంది.     

 ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జీవి ప్రకాశ్ కుమార్, కెమెరా: సాయి శ్రీరామ్, ఎడిటింగ్: ప్రవీణ్‌ పూడి చేస్తున్నారు. 

నితిన్ తాజాగా వక్కంతం వంశీతో మొదలుపెట్టబోతున్న సినిమాను కూడా త్వరలోనే సెట్స్‌ మీదకు తీసుకువెళ్ళేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. శ్రేష్టా మూవీస్ బ్యానర్‌పై ఎం సుధాకర్ రెడ్డి,నికితా రెడ్డి నిర్మించబోతున్న ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా శ్రీలీల నటించబోతోంది. ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమాలో నితిన్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రేపు (ఆదివారం) విడుదల చేయబోతున్నట్లు శ్రేష్టా మూవీస్ ప్రకటించింది. మరి ఈ ఇద్దరు దర్శకులలో ఈసారి నితిన్‌కు ఎవరు హిట్ ఇస్తారో?