ఈడంతా ఒకటే రూల్... పుష్పగాడి రూల్!

అల్లు అర్జున్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప-2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా వస్తున్న ఈ సినిమాలోని ఓ చిన్న డైలాగ్‌ని అల్లు అర్జున్‌ స్వయంగా నిన్న ‘బేబీ’ సినిమా సక్సస్ మీట్‌లో చెప్పి అభిమానులను అలరించారు. 

ఈ సినిమా పేరు పుష్ప-2 ద రూల్. ఒకటే ముక్కుంటుంది. నేను చెప్తాననుకోలేదు. కానీ చెప్తున్నా అంటూ “ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండాది... పుష్పగాడి రూల్” ఈ సినిమాలో ఓ డైలాగ్‌ చెప్పారు. అప్పుడే ఈ డైలాగ్‌ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.  

పుష్ప మొదటి భాగానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ పుష్ప-2 సినిమాలో కూడా రష్మిక మందన, రావు రమేష్, సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో పాటు మరికొంతమంది నటీనటులు కొత్తగా వస్తున్నారు. వారిలో జగపతి బాబు కూడా ఒకరు. తెలుగు, తమిళ్, కన్నడ, మలాయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్పా-2 సినిమాని కూడా మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. 

ఈ సినిమాకి ఫోటోగ్రఫీ: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. పుష్ప2 ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా 2024 సంక్రాంతి పండుగకి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.