బిగ్‌బాస్-7 గురించి చాలా రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఎట్టకేలకు వాటన్నిటికీ చెక్ పెడుతూ స్టార్-మా నిన్న ప్రమో విడుదల చేసింది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్‌గా చేయబోతున్నారు. నిన్న విడుదల చేసిన బిగ్‌బాస్-7 ప్రమోలో నాగార్జున చాలా స్టయిలిష్ లుక్‌లో “బిగ్‌బాస్-7 ఈసారి సీజన్... అంటూ మొదలుపెట్టి ఆ... చాలా కొత్తగా... అంటూ మళ్ళీ నిట్టూర్చి 'ప్రతీసారి ఇలాగే చెప్పేదిగా' అంటూ తనలో తాను అనుకొంటూ 'ఆ... కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్...' అంటూ దేవదాసులోని పాపులర్ సాంగ్ పాడుతుంటే, బిగ్‌బాస్ సెట్లో అమర్చిన వస్తువులన్నీ తారుమారు అవుతున్నట్లు చూపించారు.
కనుక ఈ సీజన్లో కొత్తగా ఏదో ప్రయత్నించబోతున్నట్లు అర్దమవుతోంది. బిగ్‌బాస్-7 సీజన్ ప్రమో వచ్చేసింది కనుక త్వరలోనే దీనిలో పాల్గొనే కంటెస్టెంట్స్ పేర్లు అలాగే ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో కూడా ప్రకటించేయవచ్చు.
అయితే బిగ్‌బాస్ మొదలైన కొత్తలో ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూడగలిగేలా షో సాగేది. కానీ రాన్రాను బిగ్‌బాస్ షోలో అశ్లీలత, విచ్చలవిడితనం పెరిగిపోతుండటంతో ఇపుడు అందరూ కలిసి చూడలేని పరిస్థితి ఏర్పడింది. సీపీఐ నేత నారాయణ అయితే బిగ్‌బాస్ షో ఓ పచ్చి బూతు షో అని ఘాటుగా విమర్శించారంటే అర్దం చేసుకోవచ్చు.