దేవర తర్వాత బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ యుద్దమే

ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ, అలనాటి అందాల తెలుగు నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా 2024, ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

ఇది ఎన్టీఆర్‌ అభిమానులకు చాలా నిరాశ కలిగిస్తోంది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్‌ సినిమా పూర్తిచేసిన ఏడాది తర్వాత తాపీగా ఈ సినిమా మొదలుపెట్టారు. మరో 8 నెలల వరకు దేవర రిలీజ్‌ కాదు. కనుక దాదాపు రెండేళ్ళు ఎన్టీఆర్‌ బొమ్మ పడలేదు. కానీ భరించక తప్పదు. 

దేవర సినిమాను నవంబర్‌లోగా పూర్తి చేసిన తర్వాత వెంటనే జూ.ఎన్టీఆర్‌ తొలిసారిగా బాలీవుడ్‌లో స్ట్రెయిట్ హిందీ సినిమాలో నటించబోతున్నారు. బాలీవుడ్‌ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి వార్-2 సినిమాలో జూ.ఎన్టీఆర్‌ నటించబోతున్నారు.

ఈ సినిమాలో వారిద్దరూ మొదట స్నేహితులుగా ఉండి తర్వాత శత్రువులుగా మారి పోరాడుకొంటారని తెలుస్తోంది. ఈ వార్-2 సినిమా 2025లో విడుదలవుతుందని సమాచారం.

దేవర సినిమాలో బాలీవుడ్‌ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. దీనిని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ అందించబోతున్నారు.