ప్రభాస్‌ రెండు సినిమాల హంగామా షురూ

ప్రభాస్‌ కెరీర్‌లో ఓ ఛత్రపతి, ఓ బాహుబలి సినిమాలలాగ నిలిచిపోవలసిన ఆదిపురుష్‌ ఓ పీడకలగా నిగిలిపోయింది. అయితే ప్రభాస్‌ని అభిమానులని ఆ పీడకల మరపింపజేయడానికి ఒకేసారి రెండు సినిమాల హంగామా మొదలైపోయింది. ఒకటి నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కె కాగా,  మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్. ఈ రెండు సినిమాలు కూడా చాలా బారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతుండటంతో ప్రభాస్‌ అభిమానులతో సహా సినీ ప్రేక్షకులందరూ చాలా ఆతృతగా వీటి కోసం ఎదురుచూస్తున్నారు. 

సలార్ సినిమా రెండుభాగాలుగా తీస్తునట్లు ఆ సినీ నిర్మాణ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని మొదటి భాగం ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇది తెలుగు సినీ పరిశ్రమలో రికార్డులను తిరగవ్రాయబోతోంది. అమెరికాలో ఏకంగా 1979 థియేటర్లలో సలార్ ‘సీజ్ ఫైర్’ విడుదల కాబోతోందని ప్రత్యంజిరా సినిమాస్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అమెరికాలో ఓ తెలుగు సినిమా ఇన్ని థియేటర్లలో విడుదల కావడం ఇదే తొలిసారి.   

సలార్‌లో ప్రభాస్‌కు జోడీగా శ్రుతీ హాసన్‌ నటిస్తోంది. జగపతిబాబు, మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా నటిస్తున్నారు. శ్రీయరెడ్డి, ఈశ్వరి రావు, టిన్ను ఆనంద్, మధు గురుస్వామి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై రూ.200 కోట్ల బారీ బడ్జెట్‌తో విజయ్‌ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ, సంగీతం: రవి బస్‌రూర్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. ఇటీవల విడుదలైన సలార్ టీజర్‌లో ప్రభాస్‌ని పూర్తిగా చూపనప్పటికీ టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. సలార్ సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.