తేజా దర్శకత్వంలో రానా, కాజల్ అగర్వాల్ జోడీగా 2017లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ హిట్ అయ్యింది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత తేజా-రానా కాంబినేషన్లో మరో సినిమా వస్తోంది. ఆ సినిమాకు తేజా ‘రాక్షస రాజు’ అని టైటిల్ కూడా ప్రకటించేశారు.
మరో విషయం ఏమిటంటే ఈ సినిమాలో డాక్టర్. రాజశేఖర్ మరో హీరోగా నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ మల్టీస్టార్ సినిమాకి ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కనుక త్వరలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు తేజా చెప్పారు.
దగ్గుబాటి రానా, డాక్టర్ రాజశేఖర్, తేజా ముగ్గురిలో కొన్ని కామన్ పాయింట్స్ కనిపిస్తాయి. ముగ్గురూ అనేక హిట్స్ ఇచ్చినవారే. కానీ ముగ్గురికీ చాలా కాలంగా ఒక్క హిట్ కూడా పడలేదు. దగ్గుబాటి రానా చేసిన అరణ్య, విరాటపర్వం సినిమాలు మంచి టాక్ తెచ్చుకొన్నాయి కానీ బాక్సాఫీసు వద్ద బోర్లా పడ్డాయి. అయితే పవన్ కళ్యాణ్‌తో చేసిన భీమ్లా నాయక్ సూపర్ హిట్ అయ్యింది.
అలాగే డాక్టర్. రాజశేఖర్ కూడా వరుసపెట్టి గరుడవేగ, కల్కి, శేఖర్ వంటి సినిమాలు చేస్తున్నా అంకుశం వంటి హిట్ పడటం లేదు. ఇక దర్శకుడు తేజ ఒకప్పుడు మంచి హిట్స్ కొట్టినా చిన్న వయసులోనే ఎంతగానో ప్రేమించే కుమారుడు చిరకాలం అనారోగ్యంతో బాధపడి మరణించడంతో దాదాపు దశాబ్ధం పైగా సినిమాలు చేయలేదు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ‘రాక్షస రాజు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కనుక వీరు ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఏవిదంగా ఉంటుందో చూడాలి.