
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటిస్తున్న ఓజీ సినిమాకు సంబందించి డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చింది.
ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ సెట్స్‌లో దర్శకుడు సుజీత్‌తో మాట్లాడుతుండగా తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “ఇమ్రాన్ హష్మీతో అద్భుతమైన షెడ్యూల్ జరిగింది. ఇమ్రాన్ కూడా ఓజీ సెట్స్‌లో పనిచేయడం బాగానే ఆస్వాదించారని భావిస్తున్నాము. త్వరలో జరుగబోయే తదుపరి షెడ్యూల్లో మీరు పవన్ కళ్యాణ్‌ని ఎదుర్కొబోయే సన్నివేశాల కోసం మేము ఆతృతగా ఎదురుచూస్తున్నాము,” అంటూ ట్వీట్ చేసింది.
చాలామంది దర్శకనిర్మాతలు తమ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తవుతున్నా వాటి గురించి మీడియాకు, అభిమానులకు ఎటువంటి అప్‌డేట్స్ ఇవ్వరు. దీంతో కొన్నిసార్లు అభిమానులు వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తుంటారు. మరికొందరు వారే పోస్టర్స్ క్రియేట్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
పవన్ కళ్యాణ్ ఒకేసారి హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో, ఓజీ సినిమాలు చేస్తున్నారు. వాటన్నిటిలో ఒక్క ఓజీ సినిమా గురించి మాత్రమే దానిని నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు ఈవిదంగా అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులను సంతోషపరుస్తోంది.
ఓజీ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, కమల్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: వజీద్ బేగ్ అందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.