
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటిస్తున్న ఓజీ సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ ఆదివారంనాడు పూర్తయిందని డీవీవీ దానయ్య ఎంటర్‌టైన్‌మెంట్ తెలియజేసింది. ఈ సందర్భంగా ఈ సినీ బృందం అందరూ కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలలో తన వారాహి వాహనంలో రాజకీయ యాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ చేయవలసిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ముందే పూర్తి చేయడంతో, ఇప్పుడు ఆయన లేకపోయినా మిగిలిన నటీనటులతో తీయాల్సిన సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు. మళ్ళీ వచ్చేనెల 10-15 తేదీల తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి షూటింగ్‌లో పాల్గొనవచ్చని తెలుస్తోంది.
సుజీత్ తన అభిరుచికి తగ్గట్లుగానే ఈ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసిపోకుండా తీస్తున్నాడని ఈ సినిమాలో నటిస్తున్న అర్జున్ దాస్ ఇటీవలే చెప్పారు. ఈ సినిమాలో నటిస్తున్న కమల్ కూడా “ఈ సినిమా ఇండస్ట్రీలో అన్ని రికార్డులు బద్దలుకొట్టబోతోంది. అభిమానులు పవన్ కళ్యాణ్‌ని ఏవిదంగా చూడాలనుకొంటున్నారో ఆ విదంగా సుజీత్ చూపించబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్, యాక్షన్ సీన్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు.
అసలు సుజీత్ దర్శకత్వంలో సినిమా అన్నప్పుడే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు కమల్, అర్జున్ దాస్ చెప్పిన ఈ మాటలు విని అభిమానులు సంతోషంతో పొంగిపోతూ సినిమా కోసం ఆతృగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: వజీద్ బేగ్ అందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.