షూటింగ్‌లో పృధ్వీరాజ్‌కు గాయాలు... సలార్‌ ఆలస్యమవుతుందా?

ప్రముఖ మలయాళ నటుడు పృధ్వీరాజ్‌ ‘విలయత్ బుద్ధ’ అనే మలయాళ సినిమా షూటింగ్‌లో పాల్గొటుండగా గాయపడ్డారు. గత కొన్నిరోజులుగా కేరళలోని కొచ్చిలో ఆ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. సోమవారం ఉదయం ఆ సినిమా కోసం ఓ యాక్షన్ సన్నివేశంలో నటిస్తుండగా పృధ్వీరాజ్‌ కాలు ఫ్రాక్చర్ అయిన్నట్లు తెలుస్తోంది. యూనిట్ సభ్యులు వెంటనే కొచ్చిలోని ఓ  కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చారు. వైద్య పరీక్షలు చేసి కాలుకి చిన్న ఫ్రాక్చర్ అయ్యిందని చిన్న శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపిన్నట్లు సమాచారం. శస్త్రచికిత్స తర్వాత కనీసం 1-2 నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన్నట్లు తెలుస్తోంది. 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో పృధ్వీరాజ్‌ ‘వరదరాజ మన్నార్’ అనే ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు. కనుక 1-2 నెలలు విశ్రాంతి తీసుకోవలసివస్తే ఆ సినిమా షూటింగ్‌కు హాజరుకాలేకపోతే సినిమా ఆలస్యం కావచ్చు. 

సలార్ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా, శ్రుతిహాసన్ నటిస్తోంది. జగపతి బాబు, ఈశ్వరీరావు, మధు గురుస్వామి, పృధ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. సలార్ 2023, సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది.

హోంభలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ సలార్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ, సంగీతం: రవి బస్‌రూర్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.