
మహేష్ బాబు-త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఏవో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సినిమా నుంచి పూజాహెగ్డేను తప్పించేసి ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకొన్నాక మళ్ళీ హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభించారు.
సంగీత దర్శకుడు ఎస్.తమన్‌ను కూడా తప్పించేశారని ఊహాగానాలు వినిపించినప్పటికీ ఆయనని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇటువంటి భారీ అంచనాలున్న సినిమాలో నుంచి సీనియర్ హీరోయిన్లలో ఒకరిగా నిలుస్తున్న పూజాహెగ్డేను తప్పించేయడం ఆశ్చర్యకరమే. బహుశః ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారని సర్ధిచెపుతారేమో?
ఏది ఏమైనప్పటికీ మళ్ళీ షూటింగ్ ప్రారంభం అవడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. ఈరోజు షూటింగ్లో వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. వారిపై కొన్ని కామెడీ సన్నివేశాలను చిత్రీకరించిన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా మీనాక్షీ చౌదరి నటించబోతోంది. శ్రీలీల మరో హీరోయిన్గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ఈ సినిమా విడుదలకాబోతోంది.