
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళాశంకర్ సినిమా టీజర్ ఎల్లుండి శనివారం విడుదల చేయబోతున్నట్లు ఏకే ఎంటర్టైన్మెంట్స్ కొద్ది సేపటి క్రితం ట్విట్టర్లో ప్రకటించింది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, గెటప్ శ్రీను, రవిశంకర్, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇటీవల ఓ ఫైటింగ్ సీన్ షూట్ చేయగా దానిలో చిరంజీవి షావర్ అలీ, వజ్ర అండ్ ఫైటర్స్, మరికొందరు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు.
ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కాబోతున్న సంగతి తెల్సిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం (2015)కి ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, ఫోటోగ్రఫీ: డుడ్లీ అందిస్తున్నారు.