
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు మళ్ళీ స్వర్ణయుగం వచ్చిందనిపిస్తోంది. ఓ వైపు వందల కోట్లు పెట్టుబడులు పెట్టి ఆర్ఆర్ఆర్, ఆదిపురుష్ వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీ సినిమాలు తీస్తుంటే, మరోవైపు ఆంధ్రా, తెలంగాణ ప్రజల సంస్కృతీ సాంప్రదాయాలను, వారి జీవనశైలిని, గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టిన్నట్లు చూపించే జాతిరత్నాలు, బలగం, జయమ్మ పంచాయితీ వంటి చిన్న సినిమాలు కూడా అలరిస్తున్నాయి.
మరికొందరుదర్శకులు ప్రేక్షులను టైమ్ ట్రావెల్ మెషీన్ ఎక్కించేసి కాలంలో వెనక్కుతీసుకు వెళ్ళి 1970-80 లలో జరిగిన కధలతో రంగస్థలం, పుష్ప, రంగమార్తాండ వంటి అద్భుతమైన సినిమాలతో మెప్పిస్తున్నారు. ఇవన్నీ చూస్తే తెలుగు సినీ పరిశ్రమకు స్వర్ణయుగం వచ్చిందనిపిస్తోంది కదా?
తాజాగా పెళ్ళి చూపులు సినిమా నిర్మాత యష్ రంగినేని బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్‌పై చందూ ముద్దు దర్శకత్వంలో ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ అనే పీరియాడికల్ సినిమా నిర్మిస్తున్నారు. ‘ఇచ్చట ఫోటోలు అందంగా తీయబడును’ అనేది సబ్ టైటిల్. ఈ సినిమాలో చైతన్యారావు, లావణ్య జంటగా చేస్తున్నారు. 1980లలో గ్రామీణ నేపధ్యంలో సాగే ప్రేమకధని క్రైమ్ డ్రామాగా ఈ పేరుతో తెరకెక్కిస్తున్నామని దర్శకుడు చందూ ముద్దు చెప్పారు. గతంలో తాను చేసిన ‘ఓ పిట్ట కధ’ సినిమాకు ప్రేక్షకులు చాలా ఆదరించారని, ఈసారి ఇంకా మెప్పించగలనని భావిస్తున్నానని చెప్పారు.
ఈ సినిమా జూలై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈరోజు సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు ప్రీ-రిలీజ్ పోస్టర్‌ను నేడు విడుదల చేశారు. ఈ సినిమాకు సంగీతం: ప్రిన్స్ హెన్రీ, కెమెరా: పంకజ్ తొత్తడ.