విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమా రేపే ప్రారంభం

లైగర్ దెబ్బ నుంచి కోలుకొన్నాక విజయ్ దేవరకొండ, సమంతతో కలిసి ఖుషీ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత నానికి జెర్సీతో సూపర్ హిట్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమాను ఓకే చేశాడు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ రేపు హైదరాబాద్‌ సారధీ స్టూడియోలో ప్రారంభం కాబోతోంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్‌లో తర్వాత గోవాలో చేయబోతున్నారు. ఈ సినిమాలో చాలా వరకు శ్రీలంకలో షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

విజయ్ దేవరకొండకు ఇది 12వ సినిమా కనుక వీడీ12 వర్కింగ్ టైటిల్‌తో పని మొదలుపెడుతున్నారు. ఈ సినిమాకు సంబందించి గౌతమ్ తిన్ననూరి ఇదివరకే ఓ పోస్టర్‌ విడుదల చేశారు.   

దానిలో సముద్రంలో ఉన్న ఓడలలో మంటలు ఎగసిపడుతున్నట్లు చూపారు. ఆ బ్యాక్ గ్రౌండ్‌లో పోలీస్ డ్రెస్సులో ముఖానికి ముసుగు ధరించిన ఓ వ్యక్తిని అస్పష్టంగా ఉన్నట్లు చూపారు. పక్కనే “ఎక్కడివాడినో తెలీదు. ఎవరిని మోసం చేశానో చెప్పలేను.. ఓ అజ్ఞాత గూడఛారి,” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. అంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్మగ్లింగ్‌ గ్యాంగ్స్‌తో పోరాడే అండర్ కవర్ ఆఫీసర్ పాత్ర చేయబోతున్నట్లనిపిస్తుంది. 

జెర్సీ సినిమాలో అద్భుతంగా భావోద్వేగాలు పండించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, ‘రౌడీ హీరో’గా పేరున్న విజయ్ దేవరకొండతో ఈ సినిమా తీస్తుండటంతో ఇది ఏవిదంగా ఉండబోతోందో ఊహించడం కొంచెం కష్టమే. 

ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రేపు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు కనుక ఈ సినిమాలో హీరోయిన్‌, నటీనటులు, టెక్నీషియన్స్ పేర్లు కూడా ప్రకటించవచ్చు.