
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటిస్తున్న ‘ఓజీ’ సినిమా ఇన్నిరోజులు శరవేగంగా షూటింగ్ జరుపుకొంది. ఈ సినిమాలో కూడా ముందుగా పవన్ కళ్యాణ్ చేయవలసిన సన్నివేశాలను షూట్ చేసిన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీలో తన జనసేన పార్టీ కోసం ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నారు కనుక వీలైతే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ విజయవాడ లేదా గుంటూరులో ప్లాన్ చేసుకోవాలని దర్శకనిర్మాతలను కోరగా వారు ఆలోచించుకొని చెపుతామన్నారు.
ఓజీ సినిమాలో విలన్‌గా బాలీవుడ్లో ‘కిస్సింగ్ స్టార్’ అని పేరు తెచ్చుకొన్న ఇమ్రాన్ హష్మీని ఖరారు చేసిన్నట్లు డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈరోజు ట్విట్టర్లో ప్రకటిస్తూ అతని పోస్టర్ కూడా విడుదల చేసింది. అతను కూడా హైదరాబాద్ చేరుకొని ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రేయారెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ధమన్ సంగీతం, కెమెరా వర్క్: రవి కె చంద్రన్ చేస్తున్నారు.