అమీర్‌పేటలో అల్లువారి ఏఏఏ సినిమాస్ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌ నడిబొడ్డున అమీర్‌పేటలో అల్లు అర్జున్‌ కుటుంబం ‘ఏఏఏ సినిమాస్’ పేరుతో నిర్మించిన ఓ మల్టీప్లెక్స్‌కు అల్లు అర్జున్‌ నేడు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

అత్యాధునిక హంగులతో సువిశాలంగా నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌లో 5 స్క్రీన్స్ ఉంటాయి. వాటిలో ఒక ధియేటర్‌లో అతిపెద్ద స్క్రీన్, మరో దానిలో ప్రొజెక్టర్ అవసరం లేని డిజిటల్ థియేటర్‌ అల్లు అరవింద్ తెలిపారు. ఈ మల్టీప్లెక్స్‌ మంచి రద్దీగా ఉండే అమీర్‌పేట జంక్షన్‌లో నిర్మించినందున కార్లు, ద్విచక్రవాహనాల పార్కింగ్ కోసం దిగువన మూడు అంతస్తులతో సెల్లార్ నిర్మించామని తెలిపారు. 

ఈ ప్రాంతంలో విద్యార్థులు, వ్యాపారస్తులు, షాపింగ్ కోసం వచ్చేవారు చాలా ఎక్కువగా ఉంటారు కనుక 26 వేల అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన హోటల్‌ కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. 

ఇక మల్టీప్లెక్స్‌లో మరో విశేషమేమంటే, ఓ చోట హోలోగ్రామ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అక్కడ అల్లు అర్జున్‌ స్వయంగా వచ్చి మనతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. కనుక అభిమానులు అక్కడ ఫోటోలు తీసుకొంటే, అల్లు అర్జున్‌తో కలిసి ఫోటోలు దిగిన్నట్లు ఉంటుందని అల్లు అరవింద్ చెప్పారు. ఈ మల్టీప్లెక్స్‌లో గోడలను అల్లు అర్జున్‌ నటించిన సినిమాల ఫోటోలను వరుసగా ఏర్పాటు చేసి అందంగా అలంకరించారు. అల్లు అర్జున్‌ అభిమానులకు ఇది ఎంతో సంతోషం కలిగించే విషయమే.

ఈ మల్టీప్లెక్స్‌ ప్రారంభోత్సవం కోసం అల్లు అర్జున్‌ వచ్చినప్పుడు ఆయనను చూసేందుకు భారీగా అభిమానులు తరలిరావడంతో  అమీర్‌పేట నుంచి అటు పంజాగుట్ట వరకు, ఇటు ఎస్ఆర్ నగర్‌ వరకు భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ సినిమా రేపు ఈ ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్‌ థియేటర్లో విడుదల కాబోతోంది.