మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో సినిమా ఇంకా ఎప్పుడు మొదలవుతుందా... అని అభిమానులు అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం దంచుతున్నారు. అది పూర్తవగానే రాజమౌళితో సుదీర్గ ప్రయాణం ప్రారంభిస్తారని ఇప్పటికే స్పష్టమైంది.
రాజమౌళి టీమ్ ఈ సినిమా పనులు అప్పుడే మొదలుపెట్టేశారు కూడా. తాజా సమాచారం ప్రకారం ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజునాడు ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించి వివరాలు తెలియజేయబోతున్నట్లు సమాచారం.
సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ ‘ఇండియానా జోన్స్’ తరహాలో సాహసోపేతమైన (అడ్వంచర్) కధని సిద్దం చేసిన్నట్లు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఈ సినిమా షూటింగ్ చేయబోతున్నట్లు చెప్పారు. ఈ సినిమాను రూ.1,500 కోట్ల భారీ బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయిలో తీయబోతున్నారు. అయితే కధాంశం విస్తృతి దృష్ట్యా ఈ సినిమాను రెండు లేదా మూడు భాగాలలో తీయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా మొదలుపెట్టే ముందు సుమారు రెండు నెలలపాటు రాజమౌళి వర్క్ షాపు నిర్వహిస్తారు. అప్పటికి ప్రధానపాత్రధారుల ఎంపిక పూర్తవుతుంది. కనుక మహేష్ బాబుతో సహా అందరూ దానిలో పాల్గొనవలసి ఉంటుంది. తర్వాత ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయి షూటింగ్ మొదలవడానికి మరో ఆరేడు నెలలు పట్టవచ్చు. అంటే వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చు.
అప్పటి నుంచి సినిమా పూర్తయ్యేందుకు కనీసం 4-5 ఏళ్ళు పట్టవచ్చు. అంటే 2029-30 వరకు మహేష్ బాబు రాజమౌళితో లాక్ అయిపోయినట్లే. అంతవరకు మహేష్ బాబు మరో సినిమా చేయలేరని తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్ట్ 9న రాజమౌళి స్వయంగా ఈ సినిమా గురించి చెపితేగానీ పూర్తి స్పష్టత రాదు.