
నేడు హైదరాబాద్‌లో ఓ ప్రముఖ స్టూడియోలో నట సింహ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 109వ సినిమా లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ, దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య కలిసి సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. త్రివిక్రం శ్రీనివాస్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరై నందమూరి బాలకృష్ణకు కేక్ తినిపించి పుట్టునరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలో ఒకరైన వై.రవి శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఏడాది సంక్రాంతి పండుగకు నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాలు విడుదలయ్యి రెండూ హిట్ అయ్యాయి. వాల్తేర్ వీరయ్యకు దర్శకత్వం వహించిన బాబీ ఆ సినిమాలో చిరంజీవిని అభిమానులు మెచ్చేట్లు అద్భుతంగా చూపడంతో బాలయ్య కూడా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో నేడు దీనిని ప్రారంభించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నెలాఖరు లేదా ఆగస్ట్ మొదటివారం నుంచి మొదలయ్యే అవకాశం ఉంది.
నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ నటిస్తున భగవంత్ కేసరి సినిమా టీజర్ ఈరోజే విడుదలైంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా దసరా పండుగకు విడుదల కాబోతోంది.