
అనిల్ రావిపూడి-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న ‘భగవంత్ కేసరి’ సినిమా టైటిల్ పోస్టర్ ఈరోజు విడుదల చేశారు. ఎల్లుండి అంటే జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజున ఉదయం 10.11 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్నట్లు మరో తాజా అప్డేట్ ఇచ్చారు.
టైటిల్ పోస్టర్లో బాలయ్య స్టైల్ చూసి మురిసిపోతున్న అభిమానులు టీజర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు “ఐ డోంట్ కేర్..” అని సబ్ టైటిల్ తగిలించడం ద్వారా యాక్షన్‌కు కొదవ ఉండదని చెప్పారు. ఇది బాలకృష్ణ 108వ చిత్రం గనుక రెండు తెలుగు రాష్ట్రాలలో 108 చోట్ల భారీ హోర్డింగ్స్ కూడా పెట్టారు. ఎల్లుండి టీజర్ కూడా ప్రపంచవ్యాప్తంగా 108 థియేటర్లలో అభిమానుల చేతుల మీదుగానే విడుదల చేస్తామని సినీ నిర్మాణసంస్థ తెలియజేసింది.
ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా శ్రీలీల నటిస్తోంది. తండ్రీకూతుర్ల సెంటిమెంట్ సినిమాగా అనిల్ రావిపూడి దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇది తండ్రీకూతుర్ల సెంటిమెంట్ సినిమా అయినప్పటికీ సబ్ టైటిల్ ‘ఐ డోంట్ కేర్' అని పెట్టడం చూస్తే దీనిలో బాలయ్య మార్క్ యాక్షన్, పంచ్ డైలాగ్స్ ఫుల్లుగా ఉంటాయని అర్దమవుతోంది.
ఈ సినిమా కధ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కనుక దీనిలో బాలయ్య తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు. అందుకే దర్శకుడు అనిల్ రావిపూడి ఈరోజు టైటిల్-పోస్టర్ సోషల్ మీడియాలో విడుదల చేస్తూ “గిప్పడి సంది ఖేల్ అలగ్” అంటూ తెలంగాణ యాసలో చిన్న హింట్ ఇవ్వగా, శ్రీలీల కూడా “అన్న దిగిండు ఇగ మాస్ ఊచకోత షురూ..” అంటూ మరో హింట్ ఇచ్చింది.
ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది దసరా పండుగకి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంగీతం: ధమన్, కెమెరా: అందిస్తున్నారు.