ఆదిపురుష్‌ అంటే అదృష్టమన్నారు చిరంజీవి

ఆదిపురుష్‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ మంగళవారం సాయంత్రం తిరుపతిలో వేలాదిమంది అభిమానుల మద్య చాలా అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్‌ మాట్లాడుతూ, “ఈ సినిమా కోసం మేమందరం ఒక్కోసారి రోజుకి రెండు మూడు గంటలే పడుకొంటూ రోజుకి 20 గంటలు పనిచేశాము. ఈ సినిమాలో నేను హీరో కావచ్చు కానీ అసలు హీరో మాత్రం దర్శకుడు ఓం రౌత్ మాత్రమే. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో సినిమా చూస్తే తెలుస్తుంది. జానకిగా చేసిన కృతి సనన్ అద్భుతంగా నటించింది. వెనుక ఉన్న పోస్టర్‌ చూపిస్తూ దీనిలో ఆమె ఎంత గొప్ప ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిందో చూశారా? 

అలాగే మరాఠి రంగస్థల నటుడు దేవదత్త నాగే హనుమంతుడుగా నటిస్తున్నప్పుడు నేను ఆయన నటన చూసి ఆశ్చర్యపోయాను. నిజంగా హనుమంతుడు ఇలాగే ఉంటాడా?అని అనిపించింది. లక్ష్మణుడుగా నటించిన సన్నీ సింగ్‌ సినిమాలోనే కాదు... ఇకపై నిజజీవితంలో కూడా తమ్ముడుగా భావిస్తాను,”అంటూ సినిమాలో నటించిన ప్రధానపాత్రధారుల గురించి ప్రభాస్‌ వివరించారు. 

“నేను రామాయణ గాధతో సినిమా చేస్తున్నానని తెలుసుకొన్న చిరంజీవిగారు, నన్ను అభినందించారు. రామాయణగాధతో సినిమా చేయడం గొప్ప అదృష్టం అని, అది అందరికీ లభించడాని అన్నారు. 

ఈ కార్యక్రమంలో అభిమానులు పెళ్ళెప్పుడు... పెళ్ళెప్పుడు... అని అడుగుతుంటే ప్రభాస్‌ పెళ్ళా... ఎప్పుడు చేసుకొన్నా ఇక్కడే చేసుకొంటానంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. స్టేజి మీద తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానన్నారు. ఇకపై ఏడాదికి రెండు వీలైతే మూడు సినిమాలు చేస్తానని ప్రభాస్‌ ప్రకటించడంతో అభిమానులు హర్షధ్వానాలు చేశారు. 

ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ అద్భుతమైన సెట్ వేశారు. ప్రభాస్‌ అందుకు అతనికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఆదిపురుష్‌ సినిమా ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.