ఈరోజు సాయంత్రం తిరుపతి పట్టణంలో ఎస్వీ యూనివర్సిటీలో ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ప్రభాస్‌తో సహా చిత్ర బృందంలో పలువురు తిరుపతి చేరుకొన్నారు. ముందుగా ప్రభాస్ మరికొందరు కలిసి ఈరోజు తెల్లవారుజామున సుప్రభాతసేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపం వద్ద ఆలయ అర్చకులు ప్రభాస్‌కు వేదాశీర్వచనం, స్వామివారి తీర్ధ ప్రసదాలు అందజేశారు.
ఈరోజు తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి ప్రభాస్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారు కూడా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకొనేందుకు రావడంతో కొండపై ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. అభిమానులు ప్రభాస్‌తో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించడంతో ఆలయ భద్రతాసిబ్బంది వారిని నియంత్రించేందుకు చాలా కష్టపడాల్సివచ్చింది.
కొండ కింద తిరుపతి పట్టణంలో ఎక్కడ చూసినా ఆదిపురుష్ పోస్టర్స్, ఫ్లెక్సీ బ్యానర్లతో కళకళలాడుతోంది. అభిమానులు పలుచోట్ల ప్రభాస్ కటవుట్లు పెట్టారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహణ బాధ్యత దర్శకుడు ప్రశాంత్ వర్మకు అప్పగించడంతో అతను ఎస్వీ యూనివర్సిటీ ఆవరణలో భారీ అయోధ్య సెట్ సిద్దం చేశారు. ప్రభాస్ అభిమానులు దానిలో తిరుగుతూ ఫోటోలు తీసుకొంటూ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆదిపురుష్ ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.