పుష్ప-2 ఆడియో రైట్స్‌కే అంత వస్తే...ఇక సినిమాకి ఎంతో?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా నటిస్తున్న పుష్ప-2 సినిమాకి సంబందించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. పుష్ప మొదటి భాగం సినిమాయే కాకుండా దానిలో పాటలు కూడా సూపర్ హిట్ అవడంతో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ సంగీత, సినీ నిర్మాణ సంస్థ టీ-సిరీస్‌ పుష్ప-2 సినిమా అన్ని భాషలలొ ఆడియో హక్కులకు ఏకంగా రూ.65 కోట్లు చెల్లించి సొంతం చేసుకొన్నట్లు సమాచారం. దీంతో పుష్ప-2 సినిమా థియేటర్‌ డిస్ట్రిబ్యూషన్ రైట్స్, ఓటీటీ రైట్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఊహించడం కూడా కష్టమే. 

నాటునాటు పాటతో ఆస్కార్ అవార్డ్ గెలుచుకొన్న ఆర్ఆర్ఆర్‌ సినిమా పాటల ఆడియో రైట్స్‌కి కేవలం రూ.30 కోట్లు మాత్రమే రాగా, పుష్ప-2కి దానికి రెట్టింపు కంటే మరో రూ.5 కోట్లు ఎక్కువే రావడం అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ల శక్తి సామర్ద్యాలకు నిదర్శనంగా భావించవచ్చు. ఆర్ఆర్ఆర్‌ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంశలు లభించినప్పటికీ దానిలో ఒక్క నాటునాటు పాట మాత్రమే అందరికీ గుర్తుంది. కానీ పుష్ప-1లో ప్రతీ పాట, దానికి అల్లు అర్జున్‌, రష్మికలు చేసిన ప్రతీ స్టెప్పూ కూడా నేటికీ ప్రేక్షకుల కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది. ముఖ్యంగా శ్రీవల్లీ అంటూ సాగే పాటలో అల్లు అర్జున్‌ చెప్పు జారవిడిచిన సన్నివేశం ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు అనుకరించి అందరినీ ఆహ్లాదపరిచిన సంగతి తెలిసిందే.      

దీనిలో కూడా ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో పాటు ఈసారి జగపతి బాబు కూడా నటిస్తున్నారు. 

పుష్ప-2ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సిద్దం చేస్తున్నారు. దీనిని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి కలిసి నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ: మీరొస్లా కుబా బ్రోజెక్ అందిస్తున్నారు. పుష్ప-2 ఈ ఏడాది డిసెంబర్‌ 22న లేదా 2024 సంక్రాంతి పండుగకి విడుదలయ్యే అవకాశం ఉంది.