మంచు బ్రదర్స్ గొడవలు సర్దుమణిగినట్లేనా?

ఆ మద్యన మంచు విష్ణు, మంచు మనోజ్ గొడవలు సోషల్ మీడియా వరకు వెళ్ళాయి. అయితే అవి నిజంగా గొడవలు కావని, ఓ సినిమా కోసం తీసిన సన్నివేశామని వారి తండ్రి మోహన్ బాబు కవర్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే మంచు కుటుంబంలో అందరూ సినీ ఇండస్ట్రీలో వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న సమయంలో కొడుకులు ఇద్దరూ కలిసికట్టుగా ఉంటూ నిలద్రొక్కుకొనేందుకు ప్రయత్నించకపోగా ఈవిదంగా కీచులాడుకొని రోడ్డున పడి వారి పరువు, తన పరువు కూడా తీయడాన్ని తండ్రిగా మోహన్ బాబుకి చాలా కష్టమే అనిపించవచ్చు. 

మోహన్ బాబు సినీ ఇండస్ట్రీలో ఎవరి అండదండలు లేకుండా దశాబ్ధాలుగా ఎంతో కష్టపడి పనిచేస్తూ, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకొన్నారని అందరికీ తెలుసు. కనుక తన కష్టార్జితంతో పిల్లలకు రాజబాటలు పరిచి అందిస్తే, వారు కూడా తాం ప్రతిభతో తండ్రిని మించిన కొడుకులు అనిపించుకోవాలని మోహన్ బాబు కోరుకోవడం సహజం. కానీ కొడుకుల తీరు, వైఫల్యాలు ఆయనకు చాలా బాధ కలిగించి ఉండవచ్చు. 

అయితే ఎట్టకేలకు ఇద్దరికీ సర్దిచెప్పి ఎవరి పనులు వారు చూసుకొనేలా మోహన్ బాబు చేయగలిగినట్లే ఉన్నారు. శుక్రవారం మోహన్ బాబు తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడు వివాదాల గురించి మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు. వాటి గురించి ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు. కానీ ఉపయోగం లేని వాటి గురించి మాట్లాడి సమయం వృదా చేసుకోవడం దేనికి?త్వరలో విష్ణుబాబుతో ఓ సినిమా తీయబోతున్నాము. దాని బడ్జెట్‌ వందకోట్లు. ఆ సినిమాకు సంబందించి వివరాలను విష్ణుబాబు స్వయంగా మీకు చెప్తాడు. అందరికీ నమస్కారం,” అని క్లుప్తంగా ముగించారు.