
కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ 30వ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. శుక్రవారం జూ.ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్లు ఈ సినిమాను నిర్మిస్తున్న ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్టర్‌లో తెలియజేసింది. ఈ విషయం తెలియజేస్తున్న పోస్టర్‌లో ఆ సముద్రమంతా అతని రక్తంతో వ్రాయబడిన కధలే... అంటూ సముద్రం ఒడ్డున ఇసుకలో దిగబడి ఉన్న ఆయుధాలను చూపారు. తద్వారా ఈ సినిమా కధ సముద్రంతో ముడిపడి ఉంటుందని, సముద్రంలో రక్తం చిందే అనేక పోరాటాలు ఉండబోతున్నాయని దర్శకుడు మరోసారి నొక్కి చెప్పిన్నట్లయింది.
సముద్రంపై పోరాటాలు అంటే ఆయుధాలు లేదా మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కధాంశం అయ్యుండవచ్చు. అయితే రక్తపాతం చాలా ఉంటుందని చెపుతుండటం సినిమాకు మైనస్ పాయింట్ కాబోతోంది. తెలుగు ప్రేక్షకులు ఈ కత్తులు, నరుకుడు, రక్తపాతం చూసిచూసి విసుగెత్తిపోయి ఉన్నారనే విషయం గమనించకుండా దర్శకుడు కొరటాల నేల మీద బదులు సముద్రం మీద రక్తం కార్చితే సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నట్లున్నారు. అయితే ఇప్పుడే ఈవిదంగా ఊహించడం తొందరపాటు అవుతుంది కనుక వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదలైతే కానీ హిట్టా ఫట్టా తెలీదు.
ఈ సినిమా కధ సముద్రంతో ముడిపడి సాగుతుంది కనుక తొలిసారిగా తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జాలారి కుటుంబానికి చెందిన యువతిగా నటించకతప్పడం లేదు. ఆ స్థాయి నటిని తొలి సినిమాలో డీగ్లామర్ చూపుతున్నట్లయితే అది ఆమెకు నష్టం కలిగించవచ్చు. అయితే ఎన్టీఆర్‌కి హీరోయిన్‌గా నటిస్తోంది కనుక ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే ఆమెకు దక్షిణాది సినీ పరిశ్రమలో ఇక తిరుగు ఉండదు.
దీనిని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ అందిస్తున్నారు.