ప్రముఖ నటుడు శర్వానంద్, రక్షితల వివాహం నిశ్చితార్దం జరిగి దాదాపు 5 నెలలైంది. అప్పుడు త్వరలోనే వారు వివాహం జరుగుతుందని చెప్పారు. కానీ ఇంతవరకు జరుగకపోవడంతో వారి పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. ఈ విషయం శర్వానంద్ చెవిన పడటంతో ఆయన టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
నిశ్చితార్ధం జరిగే నాటికే శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాకు ఒప్పుకొన్నారు. ఆ సినిమాను ఈ ఏడాది చివరిలోగా విడుదల చేయాలనుకొంటున్నామని నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ముందే చెప్పారు. ఆ సినిమా పూర్తిచేయాల్సిన బాధ్యత శర్వానంద్ మీద ఉంది కనుక ఆ సినిమా షూటింగ్ కోసం 40 రోజులు లండన్‌లోనే ఉన్నారు. అక్కడ షూటింగ్ పూర్తయ్యాక కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ తిరిగివచ్చారు.
శర్వానంద్, రక్షితల మద్య ఎటువంటి అభిప్రాయభేదాలు ఏర్పడలేదు. శర్వానంద్ లండన్ షూటింగ్లో ఉన్నా ఇద్దరూ ఫోన్లో టచ్చులోనే ఉన్నారు. ఆ సినిమా బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తి చేసిన తర్వాత శర్వానంద్, రక్షితల పెళ్ళి జరుగుతుంది. త్వరలోనే వారి పెళ్ళి ముహూర్తం ప్రకటిస్తాము,” అని శర్వానంద్ టీమ్ తెలియజేసింది.
శర్వానంద్ చేస్తున్న తాజా చిత్రంలో కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. శర్వానంద్, కృతిశెట్టి ఇద్దరినీ కూడా వరుస ఫ్లాపులు వెంటాడుతున్నాయి. వారిద్దరూ కలిసి ఈ సినిమా చేస్తుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాత్రం వారిద్దరికీ ఈ సినిమాతో మంచి హిట్ ఇస్తానని నమ్మకంగా చెపుతున్నాడు. ఈ సినిమా హిట్ కావాలని శర్వానంద్‌కి కాబోయే భార్య రక్షిత కూడా మొక్కుకొంటోందట! సినిమా హిట్టా ఫట్టా అనేది రిలీజ్ అయితే ఎలాగూ తెలుస్తుంది. ముందు ఇద్దరూ పెళ్ళి పీటలు ఎక్కి ఈ పుకార్లకు స్వస్తిపలికితే బాగుంటుంది కదా?