
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఓ శుభవార్త! ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ పూర్తయిపోయిందని ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న శంకర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ కోసం 1200 మంది జూనియర్ ఆర్టిస్టులు, స్టంట్ మ్యాన్‌తో ఓ అద్భుతమైన భారీ ఫైటింగ్ సీన్ షూట్ చేయడంతో సినిమా పూర్తయిందని శంకర్ తెలిపారు. ఇక బుదవారం నుంచి కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్-2 సినిమాపై దృష్టి పెడతానని శంకర్ దానిలో తెలిపారు. ఈ సినిమా కోసం సిల్వర్ బుల్లెట్ సీక్వెన్స్ మొదలుపెడతానని తెలియజేశారు.
ఇండియన్-2 సినిమా మొదలుపెట్టి చాలా కాలమే అయినా మద్యలో అనేక గొడవలు, ప్రమాదాలు, అవరోదాల కారణంగా 50% షూటింగ్ పూర్తయిన తర్వాత నిలిచిపోయింది. మళ్ళీ అందరూ చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరించుకొన్నాక శంకర్ షూటింగ్ మొదలుపెట్టారు. ఇండియన్-2తో పాటే మొదలుపెట్టిన గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తయిపోయింది కానీ అది ఇంకా పూర్తవలేదు. ఇకనైనా ఎటువంటి అవాంతరాలు ఎదురవకపోతే దానిని కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని శంకర్ పట్టుదలగా ఉన్నారు.
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా కియరా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నందున తండ్రి పాత్రకు జోడీగా అంజలి నటిస్తోంది. ఇంకా ఎస్.జే.సూర్య, సునీల్, నాజర్, రఘుబాబు, జయరాం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు, అల్లు శిరీష్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కధ: కార్తీక్ సుబ్బరాజు, కెమెరా తిరు, ఆర్ రత్నవేలు, థమన్ సంగీతం అందిస్తున్నారు.