పరశురామ్ గురించా... టైమ్ వేస్ట్: నాగ చైతన్య

నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన కస్టడీ సినిమా ఈ నెల 12న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నాగ చైతన్య మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు, దర్శకుడు పరశురామ్ గురించి అడిగిన ఓ ప్రశ్నకు నాగ చైతన్య “పరశురామ్ నా టైమ్ చాలా వేస్ట్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు అతని గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్... మీదీ నాదీ ఇద్దరిదీ టైమ్ వేస్టవుతుంది..” అంటూ తీసిపడేసిన్నట్లు మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చారు. 

అందుకు బలమైన కారణమే ఉంది. ‘గీతా గోవిందం’తో సూపర్ హిట్ కొట్టిన తర్వాత నాగ చైతన్యతో కలిసి ఓ సినిమాకు ప్లాన్ చేశాడు. ఇద్దరూ కొంతకాలం ఆ సినిమా స్టోరీ డిస్కషన్స్ చేశారు. ఆ సినిమాకి నాగేశ్వరరావు అని టైటిల్‌ పోస్టర్‌ను అన్నుకొన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. సినిమా పూజా కార్యక్రమాలు కూడా చేసి ఇక నేడో రేపో సినిమా షూటింగ్‌ మొదలుపెడతారని అందరూ అనుకొంటున్న సమయంలో పరశురామ్‌కి అనూహ్యంగా మహేష్ బాబు నుంచి కబురు రావడంతో ఆ సినిమాని వదిలేసి సర్కారువారి పాట సినిమా తీశాడు. 

ఆ తర్వాత మళ్ళీ నాగ చైతన్యతో సినిమాని మొదలుపెడతానని చెప్పుకొనేవాడు. కానీ నాగ చైతన్య పరశురామ్ తనని అవమానించిన్నట్లు భావించి అతనితో సినిమా చేయడానికి నిరాకరించాడు. అయితే ఏనాడూ పరశురామ్ గురించి నాగ చైతన్య చెడ్డగా మాట్లాడలేదు. తొలిసారిగా ఇలా బయటపడ్డాడు. అదీ... విలేఖరులు గుచ్చి గుచ్చి అడిగితే!