సమంత ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి: నాగ చైతన్య

నాగ చైతన్య సమంతతో విడిపోవడం గురించి తొలిసారిగా ఈరోజు మీడియా ఎదుట మాట్లాడాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో కృతిశెట్టితో కలిసి చేసిన కస్టడీ సినిమా ఈ నెల 12న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లలో భాగంగా మీడియాకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సమంతతో కాపురం, విడిపోవడం గురించి అడిగిన ప్రశ్నకు నాగ చైతన్య సమాధానం చెపుతూ, “మేము విడిపోయి రెండేళ్ళు, విడాకులు తీసుకొని ఏడాది అవుతోంది. విడిపోయిన తర్వాత ఇద్దరం ఎవరి జీవితాలు వారు గడుపుతున్నాము. ఆమె నాతో జీవితం పంచుకొన్న రోజులను నేను ఎప్పటికీ గౌరవిస్తాను. సోషల్ మీడియాలో మా గురించి వచ్చిన చెడు వదంతులే మా కాపురాన్ని దెబ్బ తీశాయి. ముఖ్యంగా నా గతంతో ఎటువంటి సంబందమూ లేని మూడో వ్యక్తిని మద్యలోకి లాగి వార్తలు వ్రాయడం వలన అందరం ఇబ్బంది పడ్డాము. కానీ ఒక్క విషయం చెప్పదలచుకొన్నాను. సమంత చాలా మంచి మనిషి. ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకొంటాను,” అని అన్నారు.  

ఇక అక్కినేని హీరోల సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటంపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “మేమే కాదు ఎవరైనా హిట్ సినిమాలు చేయాలనే అనుకొంటారు. అందుకోసమే తీవ్రంగా శ్రమిస్తుంటాము. కానీ అప్పుడప్పుడు పరాజయాలు పలకరిస్తూనే ఉంటాయి వాటి నుంచి పాఠాలు నేర్చుకొంటూ ముందుకు సాగుతూ మంచి సినిమాలు అందించడానికి ప్రయత్నిస్తాము. కస్టడీ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాను. సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా అభిమానులు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది మాకు,” అని నాగ చైతన్య చెప్పారు.   

కస్టడీ సినిమాలో నాగ చైతన్య ఏ.శివ అనే ఓ పోలీస్ కానిస్టేబుల్‌గా నటించాడు. కృతిశెట్టి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సంపత్ రాజు, ప్రియమణి, ప్రేమి విశ్వనాథ్, ఆనంది తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, కెమెరా: ఎస్సార్. కధీర్, ఎడిటింగ్: వెంకట్ రాజేన్ చేశారు. 

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, అంజీ ఇండస్ట్రీస్ బ్యానర్లపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.