
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా జూన్ 16వ తేదీన విడుదల కాబోతుండటంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈరోజు ప్రభాస్ స్వయంగా ట్విట్టర్‌లో ఆదిపురుష్ 3డీ ట్రైలర్ ఈ నెల 9న సాయంత్రం 5.30 గంటలకు విడుదలకాబోతున్నట్లు ప్రకటించారు. దాంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏయే థియేటర్లలో ఈ సినిమా ట్రైలర్ విడుదలకాబోతోందో ఆ జాబితాను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఆదిపురుష్ సినిమాను రామాయణంలోని అరణ్యకాండతో మొదలుపెట్టి యుద్ధకాండతో పూర్తిచేయబోతున్నట్లు ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్స్, ఫస్ట్-లుక్, టీజర్, మోషన్ పోస్టర్లను బట్టి స్పష్టమవుతోంది. ఈ సినిమాలో సముద్రం మీద వంతెన నిర్మించడం, దానిపై వానరసేనతో శ్రీరాముడు లంక చేరుకొని రావణుడుతో యుద్ధం చేయడం ప్రధానఅంశాలుగా చూపాలని దర్శకుడు భావిస్తున్నట్లున్నారు. బహుశః అందుకే ఈ సినిమాని 3డీకలో కూడా విడుదల చేస్తున్నట్లున్నారు. అయితే ఈ సినిమాపై వస్తున్న విమర్శలను బట్టి ఇది ప్రేక్షకులను మెప్పించగలదా లేదో తెలియాలంటే జూన్ 16వరకు ఎదురు చూడాల్సిందే.
ఆదిపురుష్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ రావణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు.
భూషణ్ కుమార్, కృషన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రోఫిలీస్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సచేత్-పరంపర సంగీతం, కార్తీక్ పళని కెమెరా, అపూర్వ మోతీవాలే, ఆశిష్ మాత్రే ఎడిటింగ్ చేస్తున్నారు.