ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయబోతున్న సినిమా గురించి అప్డేట్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-రిలీజ్ దశలో ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ విషయం రామ్ చరణ్ స్వయంగా చెప్పారు. దీనిలో తన పాత్ర రంగస్థలం సినిమాలో తనకు ఎంతో పేరు తెచ్చిన చిట్టిబాబు పాత్ర కంటే చాలా గొప్పగా ఉంటుందని రామ్ చరణ్ చెప్పారు.
క్రీడల నేపధ్యంతో ఈ సినిమా రూపొందబోతోంది. దీనిలో రామ్ చరణ్ ఉత్తరాంద్ర (ఉమ్మడి విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం జిల్లాలు) యువకుడిగా నటించబోతున్నారు. కనుక ఉత్తరాంద్ర యాసలో డైలాగ్స్ ఉంటాయి. ఉత్తరాంద్ర క్రీడల నేపధ్యంతో కధ అంటే ఉత్తరాంద్రకు చెందిన అలనాటి ప్రముఖ మల్లయోధుడు కోడి శ్రీరామ్మూర్తి జీవితకధ ఆధారంగా సినిమా తీస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇది ఆయన బయో పిక్ కాదని వేరే కధాంశంతో తెరకెక్కిస్తున్నామని దర్శకుడు బుచ్చిబాబు సానా చెప్పారు.
ఈ సినిమాను వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై కొత్తగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళేందుకు ఇంకా చాలా సమయం ఉంది కనుక ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లను ఇంకా ఖరారు చేయవలసి ఉంది.
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే సినిమాను పూర్తి చేస్తున్నారు. అది పూర్తికాగానే బుచ్చిబాబుతో ఈ సినిమా మొదలుపెడతారు.