మహేష్-త్రివిక్రమ్ మూవీ నిలిచిపోయిందా?

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్‌ దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న #ఎస్ఎస్ఎంబీ28 సినిమా షూటింగ్ నిలిచిపోయిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. మహేష్-త్రివిక్రమ్ మద్య విబేధాలు తలెత్తడంతో షూటింగ్‌ మద్యలో నిలిపివేసి ఫ్యామిలీతో విదేశాలకు వెళ్ళిపోయారని వాటి సారాంశం. ఈ పుకార్లపై ఈ సినిమా నిర్మాత నాగ వంశీ వెంటనే ట్విట్టర్‌లో స్పందిస్తూ, “ఆహారం కోసం వెతికేటప్పుడు పక్షులు పెద్దగా శబ్ధాలు చేస్తుంటాయి. అందరి దృష్టి ఆకర్షించడం కోసం కొందరు ఈ పుకార్లు సృష్టిస్తుంటారు. వీటిని చూసి నవ్వుకోవాలి లేదా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుపోవాలి. మహేష్ అభిమానులకు నేను చెప్పేది ఒకటే. మీరందరూ ఎప్పటికీ గుర్తుపెట్టుకొనేలా ఈ సినిమా ఉంటుంది. వ్రాసి పెట్టుకోండి,” అని మెసేజ్‌ పెట్టారు.

మహేష్ తండ్రి కృష్ణ మరణించడంతో ఈ సినిమా షూటింగ్‌ కాస్త ఆలస్యంగా సెప్టెంబర్‌లో మొదలైనప్పటికీ ఆ తర్వాత శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. వచ్చే నెల 31న దివంగత కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌, పోస్టర్‌ ప్రకటించనున్నారు. 2024, జనవరి 13న సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల చేస్తామని నిర్మాత నాగవంశీ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు.