ఆదిపురుష్‌ టీజర్‌ కంటే ట్రైలర్‌ గొప్పగా ఉంటుందట... బాబోయ్!

ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమా ఈ ఏడాది జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. కనుక ఇక నుంచి సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాలని చిత్రబృందం నిర్ణయించింది. ముందుగా మే మొదటివారంలో ఆదిపురుష్‌ ట్రైలర్‌ విడుదల చేయబోతోంది. దాదాపు మూడున్నర నిమిషాలు సాగే ఈ ట్రైలర్‌... ఇదివరకు విడుదల చేసిన టీజర్‌ కంటే గొప్పగా ఉంటుందని  సమాచారం. కానీ ఆ ఒక్క టీజర్‌తోనే ఆదిపురుష్‌ సినిమా పరువుపోయిందనే విషయం అందరికీ తెలుసు. ట్రైలర్‌లో దానికంటే ఇంకా గొప్పగా ఉంటుందంటే ఏమనుకోవాలో? 

రామాయణ, మహాభారత, భాగవత గాధలు జగద్విఖ్యాతమైనవి. ఎవరు ఎన్నిసార్లు సినిమాగా తీసినా కోట్లాదిమంది భారతీయుయలతో సహా అనేకదేశాల ప్రజలు చూస్తూనే ఉంటారు. కనుక రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో 5 భాషలలొ పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ ఆదిపురుష్‌ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ ఉందనే భావించవచ్చు. కానీ భారతీయులనే మెప్పించలేక తడబడుతున్న ఆదిపురుష్‌ ఇక ప్రపంచదేశాల ప్రజలను మెప్పించగలదా?చూడాలి. 

ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ రావణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. భూషణ్ కుమార్, కృషన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రోఫిలీస్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సచేత్-పరంపర సంగీతం, కార్తీక్ పళని కెమెరా, అపూర్వ మోతీవాలే, ఆశిష్ మాత్రే ఎడిటింగ్ చేస్తున్నారు.