ఓజీ సెట్స్‌లోకి పవన్‌ కళ్యాణ్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ముంబైలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ కూడా ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ముంబై చేరుకొని ఓజీ సెట్స్‌లో అడుగుపెట్టారు. ఆ ఫోటోలను చిత్రబృందం మీడియాకు విడుదల చేశారు.

ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌కు జోడీగా ప్రియాంకా అరుల్ మోహన్ నటించబోతున్నట్లు తెలిపారు. ఆమె నాచురల్ స్టార్ నాని హీరోగా చేసిన గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆమెకు కొన్ని తమిళ సినిమాలలోనే అవకాశాలు వచ్చాయి కానీ తెలుగులో మాత్రం రాలేదు. కొంత గ్యాప్‌ వచ్చినా ఏకంగా పవన్‌ కళ్యాణ్‌కు హీరోయిన్‌గా నటించే గొప్ప అవకాశం లభించింది. ఆమె కూడా ముంబై చేరుకొని ఓజీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలలో కూడా పాల్గొనవలసి ఉంది కనుక ఏ సినిమా మొదలుపెట్టినా ముందుగా ఆయన ఉండే సన్నివేశాలను షూటింగ్‌ పూర్తి చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌తో తమిళ సినిమా ‘వినోదాయ సీతం’ను తెలుగులో రీమేక్ చేస్తున్న సముద్రఖని అదే చేశారు. ఇప్పుడు ఓజీ కోసం సుజీత్ కూడా అదే చేస్తున్నారు. 

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఓజీ సినిమాని నిర్మిస్తున్నారు. ఓజీ అంటే ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అనే టైటిల్‌ను నిర్మాత ఫిలిమ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. ఈ సినిమాకి సంగీతం: తమన్, కెమెరా: వజీద్ బేగ్ అందిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే హరిహరవీరమల్లు, వినోదాయ సీతం (తెలుగు రీమేక్) పూర్తి చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఓజీ సినిమా కూడా మొదలుపెట్టారు.