
హాస్యనటుడు ఎల్దండ వేణు దర్శకుడుగా మారి తీసిన తొలి సినిమా బలగం ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. వేణు సొంత జిల్లా సిరిసిల్లా కావడంతో జిల్లాలోనే కోనరావుపేట మండలంలోని కొలనూరు గ్రామంలో వేణుకి పరిచయస్తుడైన రవీందర్ రావు అనే వ్యక్తి ఇంట్లో ఈ సినిమా షూటింగ్ చేశారు.
మొదట దానిని షార్ట్ ఫిలిమ్ అనుకొన్నానని కానీ పూర్తిస్థాయి సినిమాయే అని తర్వాత తెలిసిందని రవీందర్ రావు అన్నారు. దాదాపు నెలన్నర రోజులు ఏకధాటిగా తన ఇంట్లో బలగం సినిమా షూటింగ్ జరిగిందని చెప్పారు. షూటింగ్ కోసం తాను కుటుంబంతో వేరే ఇంట్లోకి మారానని చెప్పారు. తన ఇల్లును వాడుకొన్నందుకు వేణు నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదన్నారు. తన ఇంట్లో సినిమా షూటింగ్ జరగడం గొప్పగా అనిపించిందని, సినిమాలో తన ఇంటిని చూసుకొని చాలా సంతోషించానని రవీందర్ రావు అన్నారు.
కానీ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన తర్వాత షూటింగ్ కోసం ఇల్లు ఇచ్చినందుకు వేణు కనీసం తనకు ఫోన్ చేసి థాంక్స్ చెప్పలేదని అన్నారు. అయితే సినిమా హిట్ అయిన తర్వాత వేణు చాలా బిజీగా ఉన్నాడనే విషయం వార్తలలో చూస్తున్నందున తాను కూడా ఏమీ అనుకోలేదని రవీందర్ రావు చెప్పారు. తెలుగు ప్రజలందరూ మెచ్చుకొనేవిదంగా వేణు ఓ చక్కటి సినిమా తీసినందుకు చాలా సంతోషిస్తున్నానని, అతనిని అభినందిస్తున్నానని రవీందర్ రావు అన్నారు.