
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దాదాపు ఏడాదికి పైగా ఎన్టీఆర్ కాలక్షేపం చేసేశారు. ఈలోగా రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా దాదాపు పూర్తి చేసేశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేయడానికి సిద్దపడటంతో అభిమానులు ఆందోళన చెందారు. ఎందుకంటే చిరంజీవి, రామ్ చరణ్ వంటి ఇద్దరు పెద్ద హీరోలకు ఆచార్య వంటి డిజాస్టర్ ఇచ్చినందుకు.
ఇక రాజమౌళితో ఏ హీరోతో సినిమాతీసినా అది 100% హిట్ అవుతుంది... ఆ హీరోకి మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. కానీ తర్వాత ఆ హీరో వేరేవరితో సినిమా చేసినా తప్పక ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఎన్టీఆర్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. వారి భయాలకు తగ్గట్లుగానే ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా మొదలుపెట్టినందుకు!
అయితే ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజి’ వంటి సూపర్ హిట్ వచ్చింది కనుక ఇప్పుడు వారిద్దరూ కలిసి తప్పక మరో హిట్ కొడతారని అభిమానులు భావిస్తున్నారు. అయితే కొరటాలతో సినిమా ప్రకటించినప్పటికీ, ఎంతకీ సినిమా మొదలుపెట్టకపోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో అసహనం ప్రదర్శించడంతో ఎట్టకేలకు ఈ నెల 1వ తేదీన షూటింగ్ మొదలుపెట్టారు.
షూటింగ్ అప్‌డేట్స్ గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తుండగానే అప్పుడే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందని ప్రకటించడంతో వారి ఆనందానికి హద్దులే లేవు. ఈ నెలాఖరులోగా రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్‌లో రావణుడుగా నటిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేయబోతున్నట్లు తాజా సమాచారం.
#ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ అందిస్తున్నారు. 2024, ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.