
సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలలో శాకుంతలం ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సమంత మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “శకుంతల, దుష్యంతుల ప్రేమ కధ గురించి చిన్నప్పుడు విన్నదే తప్ప సినిమా మొదలుపెట్టే ముందు కొత్తగా ఏమీ తెలుసుకోలేదు. ఈ సినిమాపై ఇతర సినిమాల ప్రభావం పడకూడదనే ఉద్దేశ్యంతో దర్శకుడు గుణశేఖర్ నన్ను వేరే పౌరాణిక సినిమాలు ఏవీ చూడొద్దని కోరారు. అది చాలా మంచి సలహా అని నేను భావిస్తున్నాను.
మోడ్రన్ అమ్మాయినైన నేనే ఈ సినిమా కధతో చాలా కనెక్ట్ అయ్యాను. నేనే కాదు... ఇప్పటి అమ్మాయిలందరూ కూడా కనెక్ట్ అవుతారని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రేమ, సింగిల్ మదర్, హక్కుల కోసం ఒంటరి పోరాటం నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. కనుక ప్రతీ మహిళ నేను చేసిన ఈ శకుంతల పాత్రతో కనెక్ట్ అవుతుందనే అనుకొంటున్నా.
ఇక గుణశేఖర్ నాకు ఈ కధ చెప్పి, శకుంతల పాత్ర చేయాలని అడిగినప్పుడు నేను వెంటనే ‘యస్’ చెప్పలేకపోయాను. ఎందుకంటే, ఆ పాత్రకి నేను న్యాయం చేయగలనా లేదా అనే భయపడ్డాను. కానీ గుణశేఖర్ నన్ను ఒప్పించి సినిమాలో పాత్రకి తగ్గట్లుగా నన్ను మౌల్డ్ చేసుకొన్నారు. తొలిసారిగా ఈ సినిమాను 3డీలో ప్రీవ్యూ చూసినప్పుడు, తెరపై నన్ను నేను చూసుకొన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. గుణశేఖర్ నన్ను ఇంత గొప్పగా ప్రజంట్ చేస్తారని అసలు ఊహించలేకపోయాను.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను పెద్దగా ఇబ్బందులు లేకుండానే ప్రవేశించి నిలద్రొక్కుకోగలిగాను. సక్సస్ కారణంగా మనసు నిండా సంతోషం, ఆత్మవిశ్వాసం ఉండేవి. అదే తెరపైనా కనిపించేవి. ఆ తర్వాత వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు నాకు జీవితంలో కొత్త పాఠాలు నేర్పించాయి. సమస్యలే మనుషులకు పాఠాలు నేర్పించి మారేలా చేస్తాయి. నేను అలాగే మారాను,” అని సమంత చెప్పింది.