
కలర్ ఫోటోతో హీరోగా మారి హిట్ కొట్టిన యువనటుడు సుహాస్, రైటర్ పద్మభూషణ్ సినిమాతో ఇటీవల మరో హిట్ కొట్టాడు. దాని తర్వాత ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ పేరుతో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సుహాస్ బ్యాండ్ మేళంలో మల్లిగాడు అనే పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఓ గదిలో కుర్చీపై బ్యాండ్ మేళం పరికరాలు, బుట్టలో పువ్వుల దండ వెనుక గోడమీద ‘ఈ వేసవిలో మోత మోగిపోద్ది’ అంటూ వేసవిలో సినిమా విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు.
నూతన దర్శకుడు సుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ ఈ సినిమా మొదలుపెట్టి చాలా కాలమే అయ్యింది. కానీ అనివార్య కారణాల వలన సినిమా షూటింగ్ పూర్తవలేదు. ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు పార్టీలో జగదీష్ ప్రతాప్ బందారి, గోపరాజు రమణ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకొన్న వెంకటేష్ మహా తన మహా క్రియెషన్స్, జీఏ2, పిక్చర్స్, స్వేచ్చ క్రియేషన్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం, వాజిద్ బేగ్, సినిమాటోగ్రఫీ, కొడాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ చేస్తున్నారు. వేసవిలోనే పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. బ్యాండ్ మేలాలు వినిపిస్తుంటాయి. సరిగ్గా అప్పుడే ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో వస్తున్న సుహాస్ బ్యాండ్ మేళం ఎలా మోగుతుందో చూడాలి.