
ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్స్, టీజర్‌తో పోలిస్తే, తాజా పోస్టర్లో హనుమంతుడి రూపం బాగానే ఉంది. కోట్లాది హిందువులు మనసులలో హనుమంతుడు రూపం ఏవిదంగా ముద్రించుకొన్నారో దానికి దగ్గరదగ్గరగా ఈ రూపం ఉంది. హనుమంతుడు కళ్ళు మూసుకొని తపస్సు చేసుకొంటున్నట్లు చూపారు. వెనుక మీసాల శ్రీరాముడు (ప్రభాస్)ని చూపారు. ఈ సినిమాలో హనుమంతుడిగా దేవదత్ నాగే నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీతారాములుగా ప్రభాస్, కృతిసనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా 5 భాషలలో ఈ సినిమాని 2023, జూన్ 16న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో పాత్రధారుల వేషధారణ, గ్రాఫిక్స్ చూసి, వాటిపై వస్తున్న విమర్శలను చూసి ప్రభాస్ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ వారి వేషధారణలో ఎటువంటి మార్పులు చేయకుండా విడుదల చేయబోతుండటం సాహసమే అని చెప్పాలి. ఆదిపురుష్ హిట్ అయితే పర్వాలేదు కానీ ఒకవేళ ఇదే కారణంగా ఫ్లాప్ అయితే మాత్రం దర్శకుడు ఓంరౌత్ దీని పూర్తి బాధ్యత స్వీకరించక తప్పదు.