
ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్, యశోద వంటి సినిమాతో పాన్ ఇండియా ఫిమేల్ స్టార్‌గా ఎదిగిన సమంత మయొసైటీస్ వ్యాధి కారణంగా కెరీర్లో కాస్త వెనుకబడినప్పటికీ మళ్ళీ పుంజుకొని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తోంది. మళ్ళీ సినిమాలు చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో రెయిన్బో అనే సినిమా తీయబోతున్నట్లు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ 2021, అక్టోబర్‌లో ప్రకటించింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో నిర్మించబోతున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు శాంతరూబన్ దర్శకత్వం వహించబోతున్నట్లు అప్పుడే ప్రకటించారు. ఆయన కూడా ఈ ప్రాజెక్టులోకి సమంతకు స్వాగతం అంటూ ట్వీట్ చేశారు.
అయితే ఇప్పుడు సమంత స్థానంలో రష్మిక మందన హీరోయిన్గా చేయబోతున్నట్లు ప్రకటించారు. శాకుంతలం సినిమాలో దుష్యంతుడుగా నటించిన దేవ్ మోహన్ ఈ రెయిన్బో సినిమాలో రష్మికకు జోడీగా నటించబోతుండటం మరో విశేషం.
సమంతను తొలగించి రష్మిక మందనను ఎందుకు తీసుకొంటున్నారనే విలేఖరుల ప్రశ్నకు, “స్క్రిప్ట్ కు ఎవరు సరిపోతారో వాళ్ళనే ఎంపిక చేసుకొంటాము. ఆ ఫ్లోని మేము మార్చాలనుకోవడం లేదు. కంటెంట్, ఖర్మ అలా జరుగుతుంటాయి. వాటిని ఎవరూ మార్చలేరు,” అని నిర్మాత ప్రభు సమాధానం ఇచ్చారు.
అంటే స్క్రిప్ట్ కు ఎవరు సరిపోతారో చూసుకోకుండానే సమంత పేరు ముందు ప్రకటించారా?అంత కళ్ళు మూసుకుపోతే సినిమా ఎలా తీయగలరు?అంటూ ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ సినిమాకి సమంతని అనుకొన్న తర్వాత ఆమె వెంటనే మొదలుపెట్టలేకపోవడం, తర్వాత అనారోగ్యం కారణంగా చేయలేకపోవడం,ఈలోగా రష్మిక మందన పుష్ప సినిమాతో చాలా పాపులర్ అవడంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.