ఆదిపురుష్‌కు పోటీగా హనుమాన్ పోస్టర్‌

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్రధాన పాత్రలలో సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ ‘హనుమాన్’  ఈ ఏడాది మే 12న విడుదల కాబోతోంది. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా నేడు చిత్రబృందం హనుమంతుడి పోస్టర్‌ విడుదల చేసింది. హనుమంతులవారు ఛాతిని చీల్చుకొనగా లోపల సీతారామలక్ష్మణులు ఉన్నట్లు దానిలో చూపారు. దీనిని కేవలం ఓ చిత్రంగా చూపారు. కానీ ఇవ్వళ్ళే విడుదల చేసిన ఆదిపురుష్‌ చిత్రంలోని హనుమత్సమేత సీతారామలక్ష్మణుల పాత్రల పోస్టర్‌ మళ్ళీ ఎప్పటిలాగే విమర్శలు ఎదుర్కొంటోంది. 

సుమారు రూ.500 కోట్ల బారీ బడ్జెట్‌తో ప్రభాస్‌, కృతి సనన్, సైఫ్ ఆలీఖాన్ వంటి హేమాహేమీలు నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమా, చాలా తక్కువ బడ్జెట్‌తో, చిన్న సినిమాల దర్శకుడు ప్రశాంత్ వర్మ తేజా సజ్జా దర్శకత్వంలో పెద్దగా పేరులేని తేజసజ్జా వంటి కొత్త నటీనటులతో తీస్తున్న హనుమాన్ సినిమాతో అందరూ పోల్చి చూస్తున్నారు. ముఖ్యంగా ఆదిపురుష్‌ టీజర్‌ను హనుమాన్ సినిమా టీజర్‌తో పోల్చి చూసినప్పుడు ఆదిపురుష్‌ తేలిపోతోంది. ఇక ఆదిపురుష్‌ పాత్రల వేషధారణపై వస్తున్న విమర్శలకు అంతు ఉండటం లేదు.        

హనుమాన్ సినిమాలో హనుమంతుడి దివ్యశక్తులు కలిగిన యువకుడిగా తేజ సజ్జా, అతనికి జోడీగా అమృత అయ్యర్ నటిస్తున్నారు. వరలక్ష్మీ శర కుమార్, వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, సత్యా, గెట్ అప్‌ శ్రీను, రాజ్‌భవన్‌ దీపక్ శెట్టి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం హిందీ, మరాఠీ భాషలతో పాటు చైనీస్, కొరియన్, స్పానిష్, జపనీస్ భాషల్లో కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ: దాశరధి శివేంద్ర, సంగీతం అనుదీప్ దేవ్, ఎడిటింగ్: ఎస్‌బీ రాజు తలారి చేస్తున్నారు.