డబ్బు పెట్టి ఆస్కార్ అవార్డ్ కొనగలిగితే...

ఆర్ఆర్ఆర్‌ సినిమా పలు విభాగాలలో ఆస్కార్ ఆవార్డులకు పోటీ పడినా ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మాత్రమే అవార్డు వచ్చింది. అయితే రాజమౌళి బృందం అమెరికా రాకపోకలకు, అమెరికాలో నెలరోజులు తిష్టవేసి సినిమా ప్రమోషన్స్‌ కొరకు సుమారు రూ.80 కోట్లుపైనే ఖర్చుపెట్టారని ఊహాగానాలు వినిపించిన సంగతి తెలుసు. ఈ ఆస్కార్ ఖర్చులపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, ఆ డబ్బు తన చేతిలో ఉండి ఉంటే ఓ పది సినిమాలు తీసుకొనేవాడినని అన్నారు. 

కొందరైతే డబ్బు ఖర్చు చేసి ఆస్కార్ అవార్డు కొనుకొన్నారని చాలా దారుణమైన ఆరోపణ చేశారు. వాటిపై ఆర్ఆర్ఆర్‌ లైన్ ప్రొడ్యూసర్ ఎస్.ఎస్. కార్తికేయ స్పందిస్తూ, “డబ్బు పెట్టి ఆస్కార్ అవార్డు కొనుక్కొని రావడం సాధ్యమైతే చాలా మంది కొనుక్కొనేనేవారు కదా?అయినా ఆస్కార్ 95 ఏళ్ళ చరిత్ర కలిగిన అతి గొప్ప సంస్థ. దానిలో ప్రతీదానికి నిర్ధిష్టమైన విధివిదానాలు ఉంటాయి. ఆ ప్రకారమే ఎంపిక జరుగుతుంటుంది. 

ఆస్కార్ అవార్డ్ కోసం మేము మిగిలిన దేశాల సినిమాలతో పోటీ పడ్డాము. కనుక మా సినిమా నలుగురుకీ తెలియాలంటే ప్రమోషన్స్‌ అవసరం. ఎక్కడికక్కడ స్క్రీనింగ్స్ అవసరం. కనుక వాటి కోసం మేము రూ.5 కోట్లు వరకు ఖర్చు పెట్టాలని మొదట అనుకొన్నాము. కానీ క్రమంగా ఖర్చులు పెరిగిపోయి అది రూ.8.50 కోట్లకు చేరుకొంది. మేము అమెరికాలో ఖర్చు చేసినది ఇంతే,” అని చెప్పారు.  

“స్పీల్ బర్గ్, జేమ్స్ కామరూన్ వంటి ప్రముఖ హాలీవుడ్ దర్శకులు ఆర్ఆర్ఆర్‌ సినిమాని చూసి ప్రశంశించారని, వారి ప్రశంశలను, అమెరికన్ల అభిమానాన్ని ఎవరూ డబ్బు పెట్టికొనలేరు కదా?” అని కార్తికేయ అన్నారు.