
ఈ సంక్రాంతి పండుగకి వీరసింహారెడ్డిగా ప్రజల ముందుకు వచ్చి హిట్ కొట్టిన నందమూరి బాలకృష్ణ, తన తర్వాత చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా ఆ సినిమాలో బాలయ్య ఫస్ట్-లుక్ పోస్టర్‌ను అనిల్ రావిపూడి అభిమానులకు బహుమతిగా అందించారు. దానిలో ‘అన్న దిగిండు’ ఈసారి మీ ఊహకు మించి అంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ వారి కూతురుగా శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఇటీవల తారకరత్న మరణించడంతో బాలయ్య షూటింగ్లో పాల్గొనలేకపోయారు. కానీ ఆయన లేని సన్నివేశాల షూటింగ్ కొనసాగుతోంది. ఇప్పుడు బాలయ్య మళ్ళీ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు.
ఇప్పటి వరకు బాలయ్య తెలంగాణ కధాంశంతో సినిమాలు చేయలేదు. ఇదివరకు ఓసారి ‘నిప్పురవ్వ’ రాజేసినప్పటికీ అది సరిగా రాజుకోలేదు. కనుక ఈ సినిమాతో తెలంగాణ నేపధ్యంలో జరిగే కధాంశంతో ‘అన్న దిగుతుండు’ అదీ... ‘మీ ఊహలకు మించి’ అని దర్శకుడు అనిల్ రావిపూడి చెపుతున్నారు. కనుక బాలయ్య అభిమానులకు ఇది చాలా సంతోషం కలిగించే విషయమే.
ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.