ఆస్కార్ అవార్డులకు ముందు ఆర్ఆర్ఆర్ సినిమా అమెరికాలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దాదాపు నెలరోజులు పైనే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిలతో సహా చిత్ర బృందం అక్కడ మకాం వేసి పలు ప్రమోషన్స్, అవార్డుల కార్యక్రమాలలో పాల్గొన్నారు. అమెరికాలో హడావుడి జరుగుతున్నంతసేపు వారి పేర్లే ఎక్కువగా వినిపించాయి. వారే ఎక్కువగా కనిపించారు. కానీ ఎక్కడా ఆ సినిమా నిర్మాత డివివి దానయ్య కనబడలేదు. పేరు వినబడలేదు. రాజమౌళితో భేదాభిప్రాయాలు వచ్చినందునే ఆయన అమెరికాలో కార్యక్రమాలకు వెళ్ళలేదని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించినా ఎవరూ పట్టించుకోలేదు.
కానీ రాజమౌళి టీమ్ ఆస్కార్ అవార్డుతో హైదరాబాద్ తిరిగివచ్చేశాక ఆయన వెళ్ళి వారిని కలిసి అభినందించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “నాకు వ్యక్తిగత పబ్లిసిటీ ఇష్టం ఉండదు. అందుకే అమెరికా వెళ్ళలేదు తప్ప మామద్య ఏవో గొడవలు ఉన్నాయని కాదు. రాజమౌళితో నేను 2006 నుంచి కలిసి సాగుతున్నాను. ఆ సమయంలోనే నాకు ఓ సినిమా చేయమని అడిగితే ‘మర్యాద రామన్న’ గురించి చెప్పి, ఇంటరెస్ట్ ఉందా? అని అడిగారు. కానీ నేను చాలా భారీ బడ్జెట్‌లో సినిమా తీయాలని ఉందని చెప్పడంతో రాజమౌళి సరే అన్నారు. ఎట్టకేలకు అటు ఎన్టీఆర్, ఇటు చిరంజీవి కుటుంబాల హీరోలని తీసుకొని ఆర్ఆర్ఆర్ తీసి ఘనవిజయం సాధించారు. ఇందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.
నేను దీనిపై రూ.400 కోట్లు పెట్టుబడి పెడితే అంతకు మూడు రెట్లు వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి లేదా మరెవరూ పెట్టుబడి పెట్టలేదు. అలాగే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డ్ సాధించేందుకు ప్రమోషన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో, ఎవరు ఖర్చు పెట్టారో నాకు తెలీదు. కానీ ఆ కృషి ఫలించి భారత్‌కు ఓ ఆస్కార్ అవార్డు వచ్చింది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను,” అని నిర్మాత డివివి దానయ్య అన్నారు.