తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులలో మోహన్ బాబు కూడా ఒకరు. ఆయన ఇప్పటి వరకు 573 సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకొన్నప్పటికీ రావలసినంత గుర్తింపు, అవార్డులు రాలేదనే చెప్పాలి. అలాగే ఇండస్ట్రీలో ఆయనకు సముచిత గౌరవం కూడా లభించడం లేదనే చెప్పవచ్చు. తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరంటే చిరంజీవి లేదా బాలకృష్ణ పేర్లే వినిపిస్తాయి తప్ప వారితో సరిసమానంగా సినిమాలు చేసిన మోహన్ బాబు పేరు ఎవరూ చెప్పకపోవడమే ఇందుకు నిదర్శనం.
నిన్న మార్చి 19న ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు, తన మనసులో ఆవేదనను బయటపెట్టారు. “నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు. నా స్వయంకృషితోనే ఈ స్థాయికి ఎదిగాను. ఈ సుదీర్గ ప్రస్థానంలో నేను అనుభవించిన కష్టాలు నా పగవాడికి కూడా రాకూడదని కోరుకొంటున్నాను. ఒకానొక సమయంలో నా ఇల్లు కూడా అమ్ముకోవలసి వచ్చింది. అయితే నేను చాలా మొండివాడిని. కనుక ధైర్యంగా ముందుకే సాగుతూ ఇండస్ట్రీలో నిలదొక్కుకొన్నాను.
నా కెరీర్లో మంచి చిత్రాలలో ఒకటిగా నిలిచిన పెదరాయుడు సినిమాకి మేము నంది అవార్డుకి దరఖాస్తు చేసుకొంటే, నాకు అవార్డు రాకుండా కొందరు అడ్డుకొని వేరే చెత్తసినిమాకు ఇప్పించారు. అయితే మంచి నటుడికి అవార్డులతో కాదు ప్రజల అభిమానమే గుర్తింపు. అదే ఓ పెద్ద అవార్డు. ఈ ఇండస్ట్రీ ఎవరి సొత్తు కాదు. ఎవరూ దీనికి నాయకులు కారు. దీనిలో మా గురువుగారు దాసరి నారాయణ రావు స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. చేయగలమనుకొంటే మంచిదే.
ఇండస్ట్రీ అన్నాక అనేకమంది ఉంటారు. వారి మద్య భేధాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు కూడా ఉండటం సహజం. చిరంజీవితో నాకున్నవి అటువంటివే. కానీ అంతమాత్రన్న మేము శత్రువులమాని ఏనాడూ అనుకోలేదు. మాది భార్యాభర్తల సంబందం వంటిదనుకోవచ్చు. అప్పుడప్పుడు కస్సుబుస్సులాడుకొన్నా మళ్ళీ అవన్నీ మరిచిపోయి కలిసిపోతుంటాము. ఎదురుపడినప్పుడు ఆప్యాయంగా ఒకరినొకరం పలకరించుకొంటాము.
ఇప్పుడు నా ముగ్గురు బిడ్డలు కూడా ఇండస్ట్రీలో నిలద్రొక్కుకొన్నారు. నా పేరు చెప్పుకోనవసరంలేకుండా తమకంటూ ఎవరికివారు ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్నారు. మా విద్యా సంస్థల వలన కూడా సమాజంలో మాకు మంచి పేరే ఉందని భావిస్తున్నాము. రాజకీయాలు ఇబ్బందిగా చేసే కాపురం వంటిదని భావిస్తున్నాను,” అని అన్నారు.