భారత్‌కు ఆస్కార్ అవార్డుతో తిరిగివచ్చిన జూ.ఎన్టీఆర్ అప్పుడే సినిమా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. యువనటుడు విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘దాస్ క దమ్కీ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది.
దానిలో పాల్గొన్న జూ.ఎన్టీఆర్ అభిమానులని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆస్కార్ వేదికపై మొదట నాకు ఇద్దరు భారతీయులు కనిపించారు. ఆ ఇద్దరు తెలుగువారు కావడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఆస్కార్ వేదికపై ఇద్దరు తెలుగువారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవనిపించింది. ఈ అవార్డులు సాధించడం వెనుక మా అందరి కృషి ఎంతుందో, మీ అందరి అభిమానం, ప్రోత్సాహం, ఆశీర్వాదాలు కూడా అంతే ఉన్నాయి. మీ అందరి అభిమానమే మమ్మల్ని అక్కడ వరకు తీసుకువెళ్ళింది. మీ అందరి తరపునే మేము ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. మా అందరి తరపునే కీరవాణి, చంద్రబోసుగారు ఆస్కార్ వేదికపై అవార్డులు అందుకొన్నారు. కనుక ఇది మన అందరి అవార్డు అని నేను భావిస్తున్నాను.
ఒక్కసారి ఆస్కార్ అవార్డు అందుకొన్న ఆనందం మాకు సరిపోదనిపిస్తోంది. కనుక మళ్ళీ మరోసారి తప్పకుండా ఆస్కార్ అవార్డ్ కొట్టాల్సిందే. భవిష్యత్‌లో మన భారతీయ చిత్రాలు ఆస్కార్ అవార్డులు అందుకోవాలని మనసారా కోరుకొంటున్నాను,” అని అన్నారు.
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటించిన ‘దాస్ క దమ్కీ’ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 22న విడుదల కాబోతోంది. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఈ సినిమాను వన్మయే క్రియేషన్స్‌తో కలిసి తమ సొంత బ్యానర్ విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు.
ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన రవితేజ సినిమా ధమాకాకు డైలాగ్స్ వ్రాసిన బెజవాడ ప్రసన్న కుమార్ ఈ సినిమాకు డైలాగ్స్ వ్రాశారు. ఈ సినిమాలో రావు రమేష్, పృధ్వీరాజ్, రోహిణి, హైపర్ ఆదిపురుష్‌లో తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. కెమెరా: దినేష్ కె బాబు, సంగీతం: లియోన్ జేమ్స్.