ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ (66) గురువారం తెల్లవారుజామున ఢిల్లీలో గుండెపోటుతో మరణించారు. ఎప్పుడూ సినిమాలతో బిజీగా గడిపే సతీష్ కౌశిక్ కాస్త విరామం కోసం ఢిల్లీలోని తన స్నేహితుడు జావేద్ అక్తర్‌తో కలిసి హోలీ వేడుకలు జరుపుకొనేందుకు వెళ్ళారు. అక్కడ జావేద్ కుటుంబంతో కలిసి ఉత్సాహంగా హోలీ జరుపుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకొన్నారు. కానీ ఆ రోజు రాత్రే నిద్రిస్తున్నప్పుడు ఛాతిలో కాస్త నొప్పిగా అనిపించడంతో తన కారులోనే డ్రైవరుతో కలిసి హాస్పిటల్‌కు బయలుదేరారు. కానీ కారు హాస్పిటల్ చేరుకొనేలోగా సతీష్ కౌశిక్ గుండెపోటుతో చనిపోయారు.
సతీష్ కౌశిక్ ఉత్సవ్,సాగర్, మిస్టర్ ఇండియా, రాజాజీ, భాఘీ3 వంటి అనేక చిత్రాలలో నటించి అందరినీ తన నటనతో మెప్పించారు. రూప్ కీ రాణీ చొరోన్‌కా రాజా, తేరే నామ్, ప్రేమ్, షాదీ సే పెహ్లే వంటి కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన ఎమర్జన్సీ సినిమాలో నటిస్తున్నారు. కానీ అది పూర్తిచేసేలోగా గుండెపోటుతో చనిపోయారు.
ఆయనకు బాలీవుడ్‌తో చిరకాల అనుబంధం ఉన్నందున అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, సోనూసూద్, సునీల్ శెట్టి తదితరులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.