అనుష్క, నవీన్ చిత్రం టైటిల్‌ మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి

స్వీటీ అనుష్క తెలుగు సినిమాలో కనిపించి చాలా రోజులే అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయిగా చివరిగా కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కనుక ఆమె సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

మహేష్ బాపు దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టితో కలిసి ఆమె ఓ సినిమా పూర్తి చేసింది. ఈ సినిమాకు మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే పేరు ఖరారు చేసిన్నట్లు యూవీ క్రియెషన్స్ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో టైటిల్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసింది. దానిలో అనుష్క లండన్‌లో ఉన్నట్లు, మన హీరో పోలిశెట్టి హైదరాబాద్‌లో ఉన్నట్లు చూపారు. ఈ సినిమాలో అనుష్క పాత్ర పేరు అన్విత రవళి శెట్టి. ఓ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తుంటుంది. ఇక నవీన్ పోలిశెట్టి ఎప్పటికైనా విదేశాలలో ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడాలని కలలు కానే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. కనుక ఇది మంచి కామెడీకి ఆస్కారం ఉన్న చిత్రమని భావించవచ్చు. అనుష్కకి ఇది 48వ సినిమా. 

ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. అరుంధతి, భాగమతి వంటి హీరోయిన్‌ ఓరియంటడ్ సీరియస్ సినిమాలు చేసిన అనుష్క నవీన్ పోలిశెట్టితో కామెడీ సినిమా చేస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. వంశీ, ప్రమోద్ కలిసి యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఈ వేసవిలో విడుదల చేయబోతున్నట్లు యూవీ క్రియేషన్స్‌ తెలియజేసింది.