మూడు దశాబ్ధాల తర్వాత మళ్ళీ సినిమాలో జీవిత

ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత జీవిత రాజశేఖర్ దాదాపు 33 ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమాలలో నటించనున్నారు. కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజనీకాంత్, విశాల్‌ హీరోలుగా తీయబోతున్న ‘లాల్ సలాం’ సినిమాలో రజనీకాంత్ సోదరిగా జీవిత నటించబోతున్నారు. ఈ సినిమాని ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం చేయబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సినిమాకి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. 

నటి జీవిత గతంలో పలువురు హీరోలతో తెలుగు, తమిళ్ సినిమాలలో నటించారు. చివరిగా రాజశేఖర్ హీరోగా 1990లో విడుదలైన మగాడు సినిమాలో నటించారు. ఆ మరుసటి సంవత్సరంలో వారిరువురూ పెళ్లి చేసుకొన్నాక ఆమె సినిమాలలో నటించడం మానుకొన్నారు. అయితే 2002లో శేషు సినిమాతో దర్శకురాలిగా మారారు. తమిళంలో సేతు సినిమాని తెలుగులో శేషుగా రీమేక్ చేస్తూ దానిలో  తన భర్త రాజశేఖర్‌ని హీరోగా పెట్టి తీయగా ఆ సినిమాతో ఆమెకి దర్శకురాలిగా తన ప్రతిభ నిరూపించుకొన్నారు. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా సత్యమేవ జయతే, శేఖర్ తదితర సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆప్తుడు, ఎవడైతే నాకేంటి, మహంకాళి, శేఖర్  సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా జీవిత గుర్తింపు సంపాదించుకొన్నారు. 

రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, రమ్య రామకృష్ణ, తమన్నా, సునీల్, జాకీ ష్రఫ్ తదితరులు నటిస్తున్నారు.