ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమాకి అంతకంటే ముందు ప్రతిష్ఠాత్మకమైన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నుంచి ఏకంగా 5 విభాగాలలో అవార్డులు లభించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో రామ్ చరణ్ ప్రెజంటర్‌గా కూడా వ్యవహరించడంతో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ఒక్క ఎన్టీఆర్ తప్ప ఈ సినిమా బృందం అంతా ఈ వేడుకలలో పాల్గొనడంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ బాగా హైలైట్ అయ్యారు. కానీ ఇటీవల జూ.ఎన్టీఆర్ సోదరుడు తారకరత్న చనిపోవడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు.
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ అభిమానులు ‘మా హీరో బాగా చేశాడంటే, మా హీరో అద్భుతంగా చేశాడని’ సోషల్ మీడియాలో కత్తులు దూసుకొంటున్నారు. ఒకానొక సమయంలో జూ.ఎన్టీఆర్‌కి ఆస్కార్ అవార్డు లభించబోతోందంటూ ఊహాగానాలు వినిపించడంతో ఇద్దరు అభిమానుల మద్య సోషల్ మీడియాలో యుద్ధం పతాకస్థాయికి చేరుకొంది.
ఇటువంటి సమయంలో హెచ్‌సీఏ అవార్డుల ప్రధానోత్సవంలో రామ్ చరణ్ పేరు బాగా హైలైట్ అవడంతో జూ.ఎన్టీఆర్ అభిమానులు ఉక్రోషంతో రగిలిపోయారు. హెచ్‌సీఏ వేడుకలలో తమ హీరోకి సముచిత గౌరవం లభించలేదంటూ సోషల్ మీడియాలో హెచ్‌సీఏని దుమ్మెత్తిపోశారు.
ఈవిషయం హెచ్‌సీఏ దృష్టికి రావడంతో వెంటనే ట్విట్టర్‌లో స్పందిస్తూ, “ ప్రియమైన ఆర్ఆర్ఆర్ అభిమానులు మరియు మద్దతుదారులారా, మేము జూ.ఎన్టీఆర్‌ని ఈ వేడుకలకి ఆహ్వానించాము కానీ ఆయన ఓ సినిమా షూటింగ్ ఉండటంతో దీనికి హాజరుకాలేకపోయారు. త్వరలోనే ఆయనకి అవార్డు అందజేస్తాము,” అని ఈరోజే ఓ సందేశం పోస్ట్ చేసింది.
దానిపై ఓ అభిమాని స్పందిస్తూ, “జూ.ఎన్టీఆర్ సోదరుడు మరణించినందున ఈ కార్యక్రమానికి రాలేకపోయారు తప్ప సినిమా షూటింగ్ కోసం కాదు,” అని ట్వీట్ చేయగా హెచ్‌సీఏ మళ్ళీ దానికి బదులిస్తూ, “మేము ఆయనని ఆహ్వానించినప్పుడు ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నట్లు మాకు తెలిపారు. కానీ ఆ తర్వాత ఆయన సోదరుడు చనిపోవడంతో ఆ సినిమా షూటింగ్ వాయిదా వేసుకొన్నట్లు మాకు సమాచారం అందింది,”అని తెలియజేసింది.